ప్రకృతి వ్యవసాయం క్లుప్తంగా - గ్రామభారతి

ప్రకృతి వ్యవసాయం క్లుప్తంగా - గ్రామభారతి

రసాయన ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు అవసరం లేకుండా ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు అనేది పాలేకర్ పద్ధతి. పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 చక్రాలుంటాయి. అవి 1.బీజామృతం (Seed Dresser), 2.జీవామృతం (Fertilizer), 3.అచ్చాదన (Mulching), 4.వాఫ్స (Water Management). ఈ వ్యవసాయానికి ప్రథమంగా ప్రతి 30 ఎకరాలకి ఒక దేశవాళీ గోవు అవవసరం. ఈ వ్యవసాయానికి ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రీయ ఎరువులు, బీజామృతం వంటి విత్తన శుద్ధ రసాయనం, నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కీటక నాశనులు తయారు చేసుకొవాలి. ప్రకృతి వ్యవసాయంలో కేవలం దేశీ విత్తనాలనే విత్తుకొని సొంత విత్తన భాండాగారాలను ఏర్పాటు చేసుకోవాలి.

(1) బీజామృతం:-

కావాల్సిన పదార్ధాలు - బోరు/బావి/నది నీరు 20 లీటర్లు, నాటు ఆవు మూత్రం 5 లీటర్లు, నాటు ఆవు పేడ 5 కిలోలు (7 రోజులలోపు సేకరించినది), పొడి సున్నం 50 గ్రాములు, పాటిమట్టి/పొలం గట్టు మన్ను దోసెడు.

తయారీ: ఆవు పేడను ఒక పల్చటి గుడ్డలో మూటగా కట్టి 20 లీటర్ల నీరు ఉన్న తొట్టెలో 12 గంటలు ఉంచాలి. ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి. రెండవ రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూటను చేతితో పిసికి ద్రవ సారాన్ని నీటి తొట్టెలో కలపాలి. పేడ నీళ్ళున్న తొట్టెలో పొలం గట్టు మట్టిని పోసి కర్రతో కుడివైపునకు కలియ తిప్పాలి. 5 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని, సున్నపు నీటిని పేడ నీరున్న తొట్టిలో పోసి కలిసిపోయే వరకూ కుడివైపునకు కలియ తిప్పాలి. అన్నీ కలిపిన తర్వాత 12 గంటలపాటు ఉంచాలి.

ఈ బీజామృతాన్ని ఒక రాత్రి అలాగే ఉంచి మరునాడు ఉదయం నుంచి 48 గంటలలోపే వాడుకోవాలి. విత్తనాలకు బాగా పట్టించి, వాటిని నీడలో ఆరబెట్టుకొని నాటడానికి సిద్ధం చేసుకోవాలి.

(2) జీవామృతం:-

జీవామృతాన్ని సహజమైన ఎరువుగా చెప్పవచ్చు. ఇది ద్రవ రూపంలోను, ఘన రూపంలోను రైతులు నేరుగా తయారుచేసుకోవచ్చు.

ద్రవ రూపం: కావాల్సిన పదార్ధాలు - దేశీ ఆవు పేడ 10 కేజీలు (వారం లోపు సేకరించినది), దేశీ ఆవు మూత్రం 5 నుండి 10 లీటర్లు, బెల్లం / నల్ల బెల్లం / చెరుకు రసం 4 లీటర్లు, ద్విదళ పప్పుల పిండి (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) 2 కేజీలు, బావి/బోరు/నది నీరు 200 లీటర్లు, పాటి మన్ను / పొలంగట్టు మన్ను దోసెడు.

తయారీ: తొట్టెలో గానీ డ్రమ్ములో గానీ 200 లీటర్ల నీటిలో ఈ పదార్ధాల్నింటినీ కలిపి నీడలో 48 గంటలపాటూ ఉంచాలి. ప్రతి రోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు త్రిప్పాలి. (ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత ఒక వారం రోజుల లోపే వాడేయాలి. అవసరమైతే ఎక్కువ మోతాదులో మరలా తయారుచేసుకోవాలి). పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలు. జీవామృతం వాడితే పొలానికి ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు.

ఘన రూపం: కావాల్సిన పదార్ధాలు - దేశీయ ఆవు పేడ 100 కేజీలు, దేశీ ఆవు మూత్రం 5 లీటర్లు, బెల్లం 2 కేజీలు లేదా చెరుకు రసం 4 లీటర్లు, పప్పు ధాన్యం (శనగ, మినుము, పెసర, ఉలవ) 2 కేజీలు, పొలం గట్టు మన్ను 1/2 కేజీ.

తయారీ: పై పదార్ధాలన్నింటినీ చేతితో బాగా కలిపి 10 రోజులు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత బాగా చీకిన ఆవు పేడలో కలిపి 1 ఎకరం పొలంలో వెదజల్లి దున్నాలి. దీన్ని తయారు చేసిన 7 రోజులలోపే వాడుకోవాలి. పంటకాలం మధ్యలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి.

మరో ఘన రూపం: కావాల్సిన పదార్ధాలు - 200 కేజీల బాగా చీకిన ఆవు పేడ, తయారుచేసుకున్న 20 లీటర్ల జీవామృతం.

ముందుగా పేడ ఎరువును పలుచగా పరచాలి. తర్వాత జీవామృతాన్ని పరచిన ఎరువుపై చల్లాలి. దీనిని బాగా కలియబెట్టి ఒక కుప్పలా చేసి దానిపై గోనె పట్ట కప్పాలి. 48 గంటలు గడచిన తర్వాత దీనిని పలుచగా చేసి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోనె సంచులలో నిల్వచేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవాలి. ఇలా తయారుచేసుకున్న ఘన జీవామృతం 6 నెలల వరకూ నిల్వవుంటుంది.

(3) అచ్చాదన (Mulching) :-

పొలంలో మట్టిని ఎండనుండి, వాననీటి కోత నుండి, గాలినుండి రక్షించుకోవాలి. దీన్నే అచ్చాదన కల్పించడం అని, మల్చింగ్ చేయడం అని అంటారు. అచ్చాదన వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది, భూమి సారవంతమవుతుంది. పదేపదే నీరు పెట్టవలసిన అవసరం కూడా వుండదు. కుళ్ళి నేలలో కలిసిపోయే గడ్డి, ఆకులు వంటి ఏ వ్యర్ధ పదార్ధంతోనైనా అచ్చాదన చేసుకోవచ్చు. భూమికి అచ్చాదన మూడు రకాలుగా కల్పించవచ్చు.

  1. మట్టిని రెండు అంగుళాల లోతున గొర్రుతో దున్నాలి. దీనిని మట్టితో అచ్చాదన అంటారు. 2. ఎండు గట్టి, కంది కట్టెలు, చెరకు పిప్పి, చెరకు ఆకు, రెమ్మలు, రాలిన ఆకులు - వీటితో నేలను అచ్చాదన చేయవచ్చు. పంటకోత తర్వాత వీటిని కాల్చడం సరికాదు. 3. నేలపై తక్కువ ఎత్తులో వ్యాపించే పంటలు వత్తుగా వేసుకోవడం లేదా వివిధ రకాల మొక్కలను వాటంతటవే పెరగనివ్వడం ద్వారా నేలకు అచ్చాదన కలిగించవచ్చు. దీన్నే సజీవ అచ్చాదన అంటారు.

(4) వాఫ్స (Water Management) :-

వాఫ్స అనగా నీరు పెట్టే విధానం, సూక్ష్మ వాతావరణం కల్పించడం. పొలం భూమిలో మట్టికణాల మధ్య 50% నీటి ఆవివి, 50% గాలి ఉండేలా చేయడమే వాఫ్స ఉద్దేశం. పంట మొక్కలకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి. మొక్క అవసరాన్ని గుర్తెరిగి సాగునీటిని అందిస్తేనే భూమిలో వాఫ్స ఏర్పడుతుంది. వాఫ్స క్రియ నిరంతరం జరుగుతూవుంటుంది. మద్యాహ్నవేళలో చెట్టు/పంట మొక్క నీడ పడే చోటులో వరకూ వేళ్లు విస్తరించివుంటాయి. ఆ పరిధికి వెలుపలికి నీరందిస్తే వాఫ్స ఏర్పడి నీరు సద్వినియోగమవుతుంది.

కీటక నాశనులు :-

1.నీమాస్త్రం

నీమాస్త్రం అనగా వేప (Neem) ప్రధాన ఔషధంగా కలిగిన రసాయనం.

కావాల్సిన పదార్ధాలు - 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు, 1 కేజీ నాటు ఆవు పేడ, 5 లీటర్ల నాటు ఆవు మూత్రం, 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు.

తయారీ: ఈ పదార్ధాలన్నింటినీ ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి బాగా కలియ త్రిప్పాలి. తర్వాత 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పివుంచాలి. రోజుకు రెండుసార్లు చొప్పున ఉదయం, సాయంత్రం 2 నిముషాలపాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోసుకోవాలి. ఇదే నీమాస్త్రం. ఇలా తయారైన నీమాస్త్రాన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలుపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల, ఇతర చిన్న చిన్న పురుగుల నివారణకు ఉపయోగపడే ఈ ద్రావణాన్ని తయారుచేసుకొన్న వారం రోజులలోపు వాడేసుకోవాలి.

2.అగ్ని అస్త్రం

కావాల్సిన పదార్ధాలు - నాటు ఆవు మూత్రం 20 లీటర్లు, దంచిన మిరపకాయలు 500 గ్రాములు, దంచిన పొగాకు (Tobacco) 1 కిలో, దంచిన వెల్లుల్లి (Garlic) పేస్టు.

తయారీ: పై పదార్ధాలన్నింటినీ బానలో వేసి బాగా మరగ కాయాలి. 5 సార్లు పొంగు వచ్చే వరకూ మరగబెట్టి చల్లార్చాలి. 48 గంటలు పులియబెట్టిన తర్వాత పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే అగ్ని అస్త్రం. ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల అగ్ని అస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగు, వేరు పురుగుల నివారణకు ఉపయోగపడే అగ్ని అస్త్రం 3 నెలలపాటు నిల్వవుంటుంది.

3.బ్రహ్మాస్త్రం

కావాల్సిన పదార్ధాలు - 2 కిలోల మెత్తగా నూరిన వేపాకు ముద్ద, 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 2 కిలోల పల్లేరు (Tribulus Terrestris) / మారేడు (Aegle Marmelos) ఆకుల ముద్ద, 2 కిలోల ఉమ్మెత్త ఆకుల ముద్ద, 20 లీటర్ల నాటు ఆవు మూత్రం.

తయారీ: ముందుగా వేప, సీతాఫలం, పల్లేరు, ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి సిద్ధం చేసుకోవాలి. నూరిన ఆకు ముద్దను 20 లీటర్ల ఆవు మూత్రంలో బాగా ఉడికించాలి. 4 పొంగు వచ్చే వరకూ కాచి 24 గంటలపాటు చల్లారనివ్వాలి. తర్వాత ఆ ద్రవాన్ని పల్చటి గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే బ్రహ్మాస్త్రం. దీన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో 6 నెలల వరకూ నిల్వచేసుకోవచ్చు.

ఎకరానికి 2 నుండి 2.5 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలిపి పంటకు పిచికారీ చేసుకోవచ్చు.

ఇతర కీటక నాశన కషాయాలు:

1.దశపర్ణి కశాయం:

కావాల్సినవి - 200 లీటర్ల నీరు, దేశీ ఆవు పేడ 2 కేజీలు, దేశీ ఆవు మూత్రం 10 లీటర్లు, పసుపు పొడి 200 గ్రాములు, శొంఠి పొడి 200 గ్రాములు లేదా 500 గ్రాముల అల్లం పేస్టు, పొగాకు 1 కేజీ, పచ్చిమిర్చి పేస్టు / కారం పొడి 1 కేజీ, వెల్లుల్లి పేస్టు 1 కేజీ, బంతి పువ్వులు - ఆకులు - కాండం 2 కేజీలు.

వీటిని ముందుగా ఒక డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ దిగువ పేర్కొన్న పది ఆకులను కలుపుకోవాలి.

వేపాకు 3 కేజీలు, గానుగ (Indian Beech) ఆకులు 2 కేజీలు, ఉమ్మెత్త ఆకులు 2 కేజీలు, జిల్లేడు ఆకులు 2 కేజీలు, సీతాఫలం ఆకులు 2 కేజీలు, మునగ ఆకులు 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, బేలిఆకు/లేంతెనా (Lantana) 2 కేజీలు, తులసి/అడవి తులసి 1/2 కేజీ, వావిలి (Vitex Negundo) ఆకులు 2 కేజీలు.

పైన పేర్కొన్న వాటన్నింటినీ డ్రమ్ములో వేసి కలుపుకోవాలి. డ్రమ్ములో వేసిన పదార్ధాలను రోజుకు 3 సార్లు కుడిచేతివైపునకు మూడు నిముషాలపాటు త్రిప్పాలి. ఇలా 40 రోజులపాటు ప్రతిరోజు 3 నిముషాలు త్రిప్పాలి. ఇదే దశపర్ణి కషాయం. ఈ కషాయాన్ని 41వ రోజున పల్చటి కాటన్ గుడ్డతో వడబోసుకోవాలి. ఈ కషాయాన్ని 6 నెలలవరకూ వాడుకోవచ్చు. 200 లీటర్ల నీటిలో 6 నుండి 10 లీటర్ల కషాయాన్ని కలిపి వాడుకోవాలి. ఈ మోదాదు ఒక ఎకరానికి సరిపోతుంది. దశపర్ణి కషాయం వరిలో రసం పీల్చే పురుగులను, మామిడిలో బూడిద తెగులును నివారిస్తుంది.

శీలీంధ్ర/ఫంగస్ (Fungus) నాశనులు:

1.గోబాణం :- 100 లీటర్ల నీటిలో 6 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి ఒక ఎకరం పంటపై పిచికారి చేస్తే పంటను ఫంగస్ బెడదనుండి కాపాడుకోవచ్చు. దీన్ని గోబాణం అని అందురు.

  1. శొంఠి పాల కషాయం :- 200 గ్రాముల శోంఠి పొడిని 2 లీటర్ల నీటిలో కలిపి ఒక లీటరు మిగిలేవరకూ మరగబెట్టాలి. వేరే పాత్రలో 5 లీటర్ల దేశీ ఆవుపాలు/గేదె పాలను తీసుకొని 2 లీటర్ల పాలు మిగిలేవరకు మరగకాయాలి. ఈ పాలలో పై మీగడను తీసివేయాలి. తర్వాత 200 లీటర్ల నీటిలో ముందుగా పాలను కలిపి, తర్వాత శొంఠి కషాయాన్ని కలిపి 3 నుండి 5 నిముషాలు కుడివైపునకు కలియ త్రిప్పాలి. ఇలా తయారైన శొంఠి అస్త్రాన్ని 48 గంటలలోపు ఒక ఎకరం పంటపై పిచికారీ చేయాలి. 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటితో కలిపి ఒక ఎకరం పంటపై చల్లుకుంటే కీటకాలను నిరోధించవచ్చు. బాగా ఎండిన 5 కేజీల దేశీ ఆవు పేడను పొడి చేసి గుడ్డలో మూటకట్టి 200 లీటర్ల నీటిలో వేలాడగట్టి ఉంచాలి. 48 గంటల తర్వాత పేడ మూటను బాగా పిండాలి. సారం అంతా నీటిలో దిగుతుంది. ఆ నీటిని వడబోసి 1 ఎకరం పంటపై చల్లుకోవాలి.

పంటల నాణ్యత పెంచే ద్రావణం:

1.సప్త ధాన్యాంకుర కషాయం :-

నువ్వులు 100 గ్రాములు, పెసలు 100 గ్రాములు, మినుములు 100 గ్రాములు, ఉలవలు 100 గ్రాములు, బొబ్బర్లు (అలసందలు) 100 గ్రాములు, శెనగలు 100 గ్రాములు, గోధుమలు 100 గ్రాములు.

వీటన్నంటినీ మొలకలు వచ్చేలా తడిగుడ్డలో కట్టుకోవాలి. మొలకలు వచ్చిన తర్వాత తీసి రోటి పచ్చడిలా రుబ్బుకోవాలి. 200 లీటర్ల నీళ్ళు, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం కలిపిన డ్రమ్ములో ఈ పచ్చడిని వేసి 24 గంటలపాటు నీడలో ఉంచి మూడుపూటలా 3 నిముషాలపాటు కుడివైపునకు తిప్పాలి. తర్వాత గుడ్డతో వడబోసుకోవాలి. ఇదే పంటల నాణ్యత పెంచే ద్రావణం. పంటను కోసే 2 లేదా 3 వారాల ముందుగా ఈ ద్రావణాన్ని 1 ఎకరం పంటపై పిచికారీ చేస్తే గింజల్లో తాలు ఉండదు. ధాన్యం నిగనిగలాడుతూ ఎక్కువ బరువు తూగుతుంది. మామిడి కాయలు కోతకు వారం ముందు ఈ ద్రావణాన్ని కాయలపై పిచికారీ చేస్తే కాయలు నిగనిగలాడుతూవుండి ఎక్కువ కాలం నిల్వవుంటాయి.

Jinna Balu
Jinna Balu Platform Engineer @ Wisestep Inc, Developer and maintainer of Platform Ops
comments powered by Disqus